భారతీయ నాగరికతలో గొప్ప ధార్మిక మహిమ గలది ఆవు. భారతీయ సంస్కృతీ, జీవన విధానానికి ఆవు ప్రతిబింబం.
గా వో మే మాతరస్సర్వా, గావోమే పితరస్సదా
గా వో మమాగ్రతస్సంతు, గావోమే సంతుపృష్ఠతః
గావో మే పార్శ్వతస్సంతు గవాంబృందేవసామ్యహం ॥
ఒకానొక కల్పకాలంలో భారతదేశం కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే దేవతలు, ఋషుల కోరిక మేరకు ‘సురభి’ని భూమిపైకి కానుకగా పంపారని, ఆ సురభి సంతతే ఈ గోవులని మనకి పురాణాలు చెబుతున్నాయి. గోవు సాక్షాత్ లక్ష్మీ, విష్ణువు స్వరూపంగా మన గ్రంథాలు అభివర్ణిస్తున్నాయి.
ఆవు అమ్మలాంటిది. తల్లిపాలను సేవించిన బిడ్డ జీవితాంతం ఎలాగైతే రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాడో అదే విధం గా వు ఇచ్చే ఉత్పత్తుల ద్వారా వ్యక్తికీ, ప్రపంచానికీ అనేక ప్రయోజనాలున్నాయి. పార్వతీమాత కైలాసమున పరమశివుని భక్తితో పూజించి తెలియక చేసే పాపములనుండి విముక్తి కలిగించే మార్గమేదైనా వుంటే చెప్పమని కోరగా దయార్ద హృదయుడైన పరమశివుడు గోవులయందు సమస్త దేవతలు వున్నారని, అట్టి గోవును పూజిస్తే సమస్త పాపములనుండి విముక్తి కలుగుతుందని అన్నారట.
భారతీయులు గోవుని భక్తితో పూజిస్తారు. శుభాన్ని ఆశిస్తూ గోమాత వ్రతాన్ని మహిళలు సోమవారం రోజున శక్తిశ్రద్ధలతో ఆచరిస్తూంటారు. రెండు కోరికల్ని మనసులో అనుకొని పూజను ఆరంభిస్తే ఆ రెండు కోరికల్ని గోమాత తీరుస్తుందని నమ్మకం.
గోమాత నందు సకల దేవతలు కలరు 1. గోవు పాదము పితృదేవతలు, 2. పిక్కలు పిడుగంటలు, 3. అడుగులు ఆకాశ గంగలు, 4. ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు, 5. కర్రి కర్రేనుగ, 6. పొడుగు పుండరీకాక్ష, 7. సన్నుకట్టు సప్తసాగరాలు, 8. గోపుమయం శ్రీలక్ష్మీ, 9. పాలు పంచామృతాలు, 10. తోక తొంబై కోటి ఋషులు, 11. బొడ్డు పొన్నపువ్వు, 12. కడుపు కైలాసం, 13. కొమ్ములు కోటిగుళ్ళు, 14. మొగము దెష్ట, 15. వెన్ను యమధర్మరాజు, 16. ముక్కుసిరి, 17. కళ్ళు కలువరేకులు, 18. చెవులు శంకనాదం, 19. నాలుక నారాయణ స్వరూపం, 20. దంతములు, దేవతలు, 21. పళ్ళు పరమేశ్వరి, 22. నోరు లోకనిధి. ప్రొద్దుటే లేచి గోవు మహాత్మ్యము పఠించుకుంటే సకలపాపములు పోవును. ఎరిగీ ఎరగక చేసిన పాపము అంతా కూడా పరిహారము.
నేపాల్లో దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటున్నారు. అశ్వయుజ బహుళ ద్వాదశి నుంచి కార్తీక శుక్లపాడ్యమి వరకు ఈ వెలుగుల పండుగ ‘తిహార్’ జరుగుతుంది. మొదటి రోజున ‘గోమాత’ పూజ జరుగుతుంది.
అన్ని దేశాలకన్నా భారతీయ గోవు సౌరశక్తిని అధికంగా గ్రహిస్తుంది. గోవులో ముక్కోటి దేవతలు దాగివున్నారు. దీని మూపురంలో ఉన్న స్వర్ణనాడి గోమాత బంగారు తత్త్వాన్నిస్తోంది. గోవునుండి పుట్టే ప్రతి పదార్థం మానవాళి ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి.
గోక్షీరం ఔషధం లాంటిది. తల్లిపాలు లేని శిశువులకు సైతం ప్రత్యామ్నాయంగా గోమాత పాలనే వాడతారు. వైద్యంలో కూడా ఆవుపాలను ఎక్కువగా వాడతారు. పల్లెటూళ్ళలో ప్రతిరోజు ఉదయాన్నే ఆవుపేడతో నీళ్లు చల్లి తద్వారా క్రిమికీటకాలనుంచి రక్షణ పొందుతారు. పూజలు నిర్వహించేటప్పుడు ఆవు పేడతో ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసి ప్రారంభిస్తారు.
శ్లో॥ గ్రీవా మస్తక సంధౌతు తాసాం గంగా ప్రతిష్ఠితా,
సర్వదేవ మయాగావ సర్వతీర్థమయాస్తధా ||
గోవు యొక్క కంఠం, మస్తకము మధ్య (గంగడోలు) గంగ కలదు. గోవు యొక్క సమస్త అంగములందు సమస్త దేవతలు, తీర్ధములు కలవు అని మనవారు భావిస్తారు.
గోవును పూజించుట
గోపాలన, పోషణ, రక్షణ దేశసమృద్ధికి సూచిక. గోవును పూజించుట కోసం రెండు వ్రతాలు ఆచరించ బడుతున్నాయి. అవి. గాద్వాదశి వ్రతం, రెండవది గోమయ వ్రతం ఈ వ్రతాలలో శ్రీ లక్ష్మీ నారాయణ ప్రతిమను, ఆవుదూడ కలిగిన ప్రతిమను – పంచగవ్యములతో శుద్ధి చేసి – బ్రహ్మకలశము, మున్నగు 33 కలశములను క్రొత్త వస్త్రములతో – దక్షిణాదులతో నుంచి నవగ్రహములను, అష్ట దిక్పాలకు లను, త్రిమూర్తులను, గణపతిని, క్షేత్ర పాలకులను ఆవాహన చేసి – ప్రాణ ప్రతిష్ట చేసి యథావిధిగా పూజించవలెను.
సూర్యుడు మకరములో ప్రవేశించినప్పుడు, లేదా రధ సప్తమినాడు తన జన్మనక్షత్రమునకు అనుకూలమైనప్పుడు యీ వ్రతమును ఆరంభింపవలయును. రజోదోషము వీడిన స్త్రీలు 18 నెలలు తరువాత ఈ వ్రతము నాచరింపవలెను. గో వ్రతము నకు ఉద్యాపనమును వ్రతాదియందుగాని, వ్రతమధ్యమందుగాని, వ్రతాంతము నందుగాని చేయవలెను.
భవిష్యోత్తర పురాణమున బ్రహ్మ, నారద సంవాదరూప గోమయ వ్రత వృత్తాంతము, గో ద్వాదశీ వ్రత వృత్తాంతము కూడా తెలుపబడ్డాయి.
ఇతిహాస యుగాలనుండీ నేటివరకు గోమాత సాక్షాత్తూ దేవతా స్వరూపమే. ఆవుకు సంబంధించిన పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడ అన్నీ కూడా ఉపయుక్తమైనవే. వీటినే పంచగవ్యాలని అంటారు. శాస్త్రీయంగా కూడా అవి ఋజువైనాయి.
“గోభిస్తుల్యం నపశ్యామి ధనం కించిది హాచ్యుత”
ఈ జగత్తులో గోసంపదతో సమానమైన ధనసంపదను చూడలేదని చ్యవన మహర్షిచే చెప్పబడింది.